కావలి ( RRR TV న్యూస్ ): నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు అర్ధరాత్రి ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ తెలిపింది.
నెల్లూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన ఎంవీఐ బానావత్ గోపీ నాయక్, ఇద్దరు హోంగార్డులు, ఒక ప్రైవేట్ డ్రైవరు సహాయంతో వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు ఏసీబీ పేర్కొంది.

తనిఖీల సమయంలో రోడ్డు పక్కన లభించిన ₹68,800 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎంవీఐ ఉపయోగిస్తున్న కియా కారును తనిఖీ చేయగా డిక్కీలో దాచిన ₹1,80,000 లెక్కల్లో చూపని నగదు లభించినట్లు ఏసీబీ తెలిపింది. దీంతో మొత్తం ₹2,48,800 నగదును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు.

